గ్రూప్‌-1 పరీక్షకు 897 కేంద్రాలు

Thank you for reading this post, don't forget to subscribe!

♦️హాజరుకానున్న 4.03 లక్షల మంది అభ్యర్థులు

♦️నోడల్‌ ఆఫీసర్‌గా అదనపు కలెక్టర్‌, ఒక పోలీస్‌ అధికారి

♦️ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్‌ కోఆర్డినేటర్‌

♦️పరీక్షల ఏర్పాట్లపై సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో టీజీపీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి వెల్లడి

🍥రాష్ట్రంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 9న సజావుగా నిర్వహించాలని అధికారులను సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. గురువారం ఆమె గ్రూప్‌1 ఏర్పాట్లపై సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రూప్‌1 ప్రిలిమినరీని సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు సీఎస్‌కు తెలిపారు.

🌀ఇందులోభాగంగా అదనపు కలెక్టర్లతోపాటు ఒక పోలీసు ఉన్నతాధికారిని కూడా నోడల్‌ ఆఫీసర్‌గా నియమించినట్టు వెల్లడించారు. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్‌ కోఆర్డినేటర్‌ను కూడా నియమించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్షకేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 4.03 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని వివరించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసు, ఇతర అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు.

💥పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

💠గ్రూప్‌-1 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని పోలీసు శాఖ వెల్లడించింది. పోలీసు కమిషనర్లు, ఎస్పీ లు భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని ఆదేశించింది. చీఫ్‌ సూపరింటెండెంట్‌ మినహా ఎవరి వద్ద సెల్‌ఫోన్లు ఉండకూడదని స్పష్టంచేసింది. పరీక్షా కేంద్రంలోనికి అభ్యర్థులు, సిబ్బంది తప్ప ఎవరినీ అనుమతించవద్దని పోలీసు శాఖ ఆదేశించింది.

💥గ్రూప్‌-1 రిజర్వేషన్ల వివరాలు చెప్పండి

🥏గ్రూప్‌-1లో రిజర్వేషన్లకు సంబంధించి వివరాలు తెలుసుకొని చెప్పాలని టీజీపీఎస్సీని హైకోర్టు గురువారం ఆదేశించింది. ప్రభుత్వ నియామకాలకు నిర్వహించే పరీక్షల నోటిఫికేషన్‌లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా గ్రూప్‌-1 పోస్టుల భర్తీలో దివ్యాంగుల క్యాటగిరీలో అమలు చేయడం లేదని పేరొంటూ మెదక్‌ జిల్లాకు చెందిన అర్జున్‌, అరుణ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

🛟దివ్యాంగుల రిజర్వేషన్ల అమలుపై వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించారు. సమాంతర రిజర్వేషన్లు అమలు చేసేలా టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదించారు. నియామక పరీక్షల్లో మహిళా, పీహెచ్‌సీ కోటాలో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టు గతంలో తీర్పులు చెప్పినప్పటికీ అమలు కావడం లేదని పేర్కొన్నారు.

✳️టీజీపీఎస్సీ తరఫున స్టాండింగ్‌ కౌన్సిల్‌ ప్రతివాదన చేస్తూ, ఉద్యోగాల నియామకాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయడానికే ప్రభుత్వం జీవో 35ను జారీ చేసిందని చెప్పారు. గ్రూప్‌-1తోపాటు ఇతర అన్ని నిమాయకాల్లో ఇది అమలవుతున్నదని వివరించారు. వాదనల తర్వాత ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.