Thank you for reading this post, don't forget to subscribe!

టిజిఎన్​పిడిసిఎల్​(​(తెలంగాణ నార్తర్న్​ పవర్​ డిస్ట్రిబ్యూషన్​ కంపెనీ లిమిటెడ్) తను విద్యుత్​ పంపిణీ చేస్తున్న జిల్లాల్లో ఇకనుండీ కరెంటు బిల్లులు కట్టడాన్ని సులభతరం చేసింది. బిల్లులు చెల్లించడానికి కొత్తగా క్యూఆర్​ కోడ్​(QR Code) విధానాన్ని తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త విధానం ప్రకారం, మీటర్​ రీడింగ్​ తీసుకున్న తర్వాత ఇంటికి పంపే బిల్లులపై ఇకనుండి క్యూఆర్​ కోడ్​ (QR code on Power bills) ముద్రించనున్నట్లు ఎన్​పిడిసిఎల్​ తెలిపింది. దీని ద్వారా వినియోగదారులు తన మొబైల్​ ఫోన్​తో కోడ్​ను స్కాన్​ చేసి బిల్లు వెంటనే చెల్లించవచ్చని, ఇది వినియోగదారులకు ఎంతో సులభమైన మార్గమని వారు అంటున్నారు.

బిల్లులోని కోడ్​ను స్కాన్​ చేయగానే, వినియోగదారుడి వివరాలు, ఈ నెల బిల్లు వివరాలు, కట్టాల్సిన మొత్తం వెంటనే ఓపెన్​ అవుతాయి. అందులోనే బిల్లులో ఉన్న మొత్తాన్ని ఎంటర్​ చేసి, ఓకే చెప్పగానే, పేమెంట్​ గేట్​వేకు వెళ్లి, పేమెంట్​ ఆప్షన్స్​ చూపుతుంది. అందులో క్రెడిట్​ కార్డ్​, డెబిట్​ కార్డ్​, నెట్​ బ్యాంకింగ్​, యూపిఐ లాంటి చెల్లింపు ప్రక్రియల ద్వారా వెంటనే కరెంటు బిల్లు కట్టేయొచ్చు. ఈ విధానాన్ని పైలట్​ ప్రాజెక్ట్​ కింద ఈ ఏప్రిల్​లో వరంగల్​లోని మట్టెవాడలో, మే నెలలో వరంగల్​ జిల్లాలో, జూన్​లో భూపాలపల్లి జిల్లాలో ఎన్​పిడిసిఎల్​ అమలుచేసి సత్ఫలితాలను పొందింది. తెలంగాణ పాత ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్​, నిజామాబాద్​, కరీంనగర్​, వరంగల్​, ఖమ్మం ఈ ఎన్​పిడిసిఎల్​ పరిధిలోకి వస్తాయి.

ఈ క్యూఆర్​ కోడ్​ విధానాన్ని దశలవారీగా(in Phased manner in all the Districts) తమ పరిధిలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని ఎన్​పిడిసిఎల్​ అధికారులు చెబుతున్నారు. ఈ కోడ్​ ఒక్కసారి బిల్లు చెల్లింపుకే వర్తిస్తుందనీ, ప్రతీనెల కోడ్​ మారుతూంటుందని వారు తెలిపారు. బిల్లులో ఉండే క్యూఆర్​ కోడ్​ను, పేటీఎం, గూగుల్​ పే, ఫోన్​పే, భీమ్​ లాంటి యూపిఐ యాప్​(Cards, Net Banking, UPI Apps) ల ద్వారా స్కాన్​ చేసి, క్షణాల్లో బిల్లు కట్టేయొచ్చని, కట్టిన మరుక్షణంలోనే, బిల్లు కట్టినట్లు ఎస్​ఎంఎస్​(SMS Acknowledgment) కూడా వస్తుందని ఎన్​పిడిసిఎల్​ అధికారి ఒకరు తెలియజేసారు.