సొంత నోట్స్‌.. రివిజన్‌కు షార్ట్‌కట్‌

Thank you for reading this post, don't forget to subscribe!

 

ఉద్యోగం కోసమైనా, ఉన్నత చదువుకైనా రివిజన్‌ చాలా ముఖ్యం. ఎక్కువ సార్లు రివిజన్‌ చేస్తే చదివింది చదివినట్టు మన మెదడులో అలా నిక్షిప్తమై ఉంటుంది. ఈ రివిజన్‌కు బెస్ట్‌ రూట్‌ సొంత నోట్స్‌ రాసుకోవడం. పదుల సంఖ్యలో పుస్తకాలు చదువుతాం. మళ్లీ అన్ని పుస్తకాలను రివిజన్‌ చేయాలంటే సమయం సరిపోదు, ఓపిక ఉండదు.

  • ర్యాంక్‌ సాధించేందుకు బెస్ట్‌ రూట్‌

ఉద్యోగం కోసమైనా, ఉన్నత చదువుకైనా రివిజన్‌ చాలా ముఖ్యం. ఎక్కువ సార్లు రివిజన్‌ చేస్తే చదివింది చదివినట్టు మన మెదడులో అలా నిక్షిప్తమై ఉంటుంది. ఈ రివిజన్‌కు బెస్ట్‌ రూట్‌ సొంత నోట్స్‌ రాసుకోవడం. పదుల సంఖ్యలో పుస్తకాలు చదువుతాం. మళ్లీ అన్ని పుస్తకాలను రివిజన్‌ చేయాలంటే సమయం సరిపోదు, ఓపిక ఉండదు. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువగా చదవాలన్నా, ఎన్నిసార్లయినా రివిజన్‌ చేసుకోవాలన్నా షార్ట్‌కట్‌గా నోట్స్‌ రాసుకోవాలి. అలా ప్రిపేర్‌ చేసుకునే సొంత నోట్స్‌ ఎన్నిసార్లయినా చదవడానికి ఈజీగా ఉంటుంది. మెరుగైన ర్యాంక్‌ సాధించేందుకు ఉపయోగపడుతుంది. సొంత నోట్స్‌ ఎలా రాయాలో, దాని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

‘నోట్స్‌” అంటే ఏమిటి?

  • ఈ పదంలోనే దాని అర్థం దాగి ఉంది. నోట్స్‌ అంటే ముఖ్యాంశాలు అని అందుకే చదువుతున్న పుస్తకాన్ని మళ్లీ యధాతథంగా రాస్తే అది నోట్స్‌ ఎందుకవుతుంది. అది మరో పుస్తకం అవుతుంది.
  • మనం ప్రిపేరవుతున్న సందర్భంలో ప్రామాణిక పుస్తకాన్ని/పుస్తకాలను ఆధారంగా చేసుకొని అందులోని కీలక అంశాలను సాధ్యమైనంత సులభ రీతిలో మనదైన శైలిలో కుదించి రాసుకోవడమే నోట్స్‌.

ప్రయోజనాలేంటి?

  • ఒకే అంశానికి సంబంధించిన విషయాలన్నీ ఒకే చోట ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్‌ సులభమవుతుంది.
  • ఈ నోట్స్‌ రివిజన్‌ చేయడానికి అత్యంత అనుకూలమైన విధానం.
  • ముఖ్యంగా సమయం ఆదా అవుతుంది.
  • విషయాన్ని అవగాహన చేసుకొని కుదించి రాస్తాం. కాబట్టి ఎక్కువ కాలం గుర్తుంటుంది.
  • విజువలైజేషన్‌, మైండ్‌ మ్యాపింగ్‌, నిమోనిక్స్‌, సినాప్సిస్‌ లాంటి పద్ధతుల్లో నోట్స్‌ తయారు చేసుకుంటాం కాబట్టి విషయం బాగా గుర్తుంటుంది. పలుమార్లు రివిజన్‌కు అవకాశం ఉండటం వల్ల అభ్యర్థి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనవసర విషయాలు పునరావృతం కావు.

నోట్స్‌ రాసే విధానం ఏమిటి?

  • మొదట అధికారిక సిలబస్‌ను పూర్తిగా అవగాహన చేసుకోవాలి.
  • ప్రామాణిక పుస్తకాన్ని/ పుస్తకాలను ఆధారంగా చేసుకొని మాత్రమే నోట్స్‌ రాయాలి.
  • మొదటిసారి పుస్తకాన్ని కేవలం నవలలా చదువుతూ వెళ్లాలి. తర్వాత గత ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా విశ్లేషించాలి.
  • రెండోసారి చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలను అండర్‌ లైన్‌ చేస్తూ నోట్స్‌ ప్రిపేర్‌ చేయాలి.
  • వేర్వేరు చోట్లలో/ పుస్తకాల్లో ఉన్న ఒకే అంశానికి చెందిన విషయాలు ఒకే చోట రాయాలి. A4 సైజ్‌ స్పైరల్‌ బైండింగ్‌ ప్లెయిన్‌ నోట్‌ బుక్‌లో రాయడం ఉత్తమం.
  • ప్రతి పేజీకి కొంత మార్జిన్‌ వదలాలి. ప్రతి చాప్టర్‌ తర్వాత 2, 3 పేజీలు వదలాలి. ఇది ఏదైనా నూతన సమాచారాన్ని జోడించడానికి వీలుగా ఉంటుంది.
  • నోట్స్‌ రాసేటప్పుడు షార్ట్‌కట్స్‌, ఫ్లో చార్ట్స్‌, టేబుల్స్‌, సింబల్స్‌, నిమోనిక్స్‌ను వినియోగించి నోట్స్‌ నిడివిని తగ్గించాలి.
  • భిన్నమైన రంగులు గల పెన్నులను విభిన్న అంశాలకు వేర్వేరుగా వినియోగిస్తూ రాస్తే ముఖ్యమైన అంశాలపై ఫోకస్‌ పెరుగుతుంది.

ఉపయోగించాల్సిన పద్ధతులు

విజువలైజేషన్‌ మెథడ్‌

  • విషయాన్ని చిత్రం రూపంలో మార్చడమే విజువలైజేషన్‌. దీనివల్ల అంశం ఎక్కువకాలం గుర్తుంటుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన అంశం. ఇది విభిన్న రీతుల్లో చేయవచ్చు.

మైండ్‌ మ్యాపింగ్‌ మెథడ్‌

  • మనకు అర్థమయ్యే రీతిలో ఫ్లో లైన్స్‌, సర్కిల్స్‌ స్ట్రెయిట్‌ లైన్స్‌, సబ్‌ లైన్స్‌ను ఉపయోగిస్తూ ఒక అంశం అంతా రెండు, మూడు లైన్లలో వచ్చే విధంగా ఒక దృగ్విషయం మాదిరిగా రాయడం.

నిమోనిక్స్‌ మెథడ్‌

  • ఇదొక మెమరీ టెక్నిక్‌ మెథడ్‌. పెద్ద అంశాన్ని లేదా ఉప అంశాల్ని కొండ గుర్తులతో షార్ట్‌ కట్‌ రూపంలో రాసుకోవడం.

సినాప్సిస్‌ మెథడ్‌

  • టేబుల్స్‌, డయాగ్రమ్స్‌, ప్యాట్రన్స్‌ను ఉపయోగించి విస్తృత అంశాన్ని కుదించి ఒకేచోట రాయడం. ఒక అంశాన్ని పూర్తి సమాచారాన్ని పట్టికలో వివిధ కాలమ్స్‌గా విభజించి రాసుకోవడం.
  • అవసరమైన చోట డయాగ్రమ్స్‌ చిత్రించడం ఉపయుక్తమైన పద్ధతి. ఉదాహరణకు ఒక వృత్తంలో హెడ్డింగ్‌ రాసి చుట్టూ బాణాల గుర్తులతో సంబంధిత ఉప అంశాల్ని రాసుకోవడం.

చెయ్యకూడనివి

  • పుస్తకం మొత్తాన్ని ప్రతిదీ ముఖ్యాంశంగా భావించి ఆసాంతం రాయకూడదు. అనవసరమైన, సిలబస్‌లో లేని, నిర్దిష్టమైన పరీక్షకు సంబంధం లేని అంశాల జోలికి వెళ్లకూడదు.
  • ఇతరుల నోట్స్‌ను కాపీ చేయకూడదు.
  • నోట్స్‌ అంతా రంగులమయం చేసి, అద్భుతమైన హ్యాండ్‌ రైటింగ్‌ కోసం సమయాన్నంతా వెచ్చించాల్సిన అవసరం లేదు. మనం చదవగలిగే, మనకు అర్థమయ్యే రీతిలో ఉంటే చాలు.
  • మెరుగైన ర్యాంక్‌ సాధనకు సొంత నోట్స్‌ అత్యంత కీలక అంశం అనేది అతిశయోక్తి కాదు. ఈ విధంగా విషయాన్ని పిక్చరైజ్‌ చేసేలా నోట్స్‌ ఉంటే శాస్త్రీయ పద్ధతిలో అంశాలు మెదడులో నిక్షిప్తమవుతాయి. రివిజన్‌ సులభమై, ఆత్మ విశ్వాసంతో పరీక్షకు హాజరవుతాం.
  • పరీక్షలో ఆయా అంశాలు చూడగానే నోట్స్‌లోని పేజీలు కళ్లముందు కదలాడుతాయి. పకడ్బందీగా, శాస్త్రీయంగా సొంతనోట్స్‌ తయారు చేసుకొని తదనుగుణంగా పటిష్ఠ ప్రణాళికతో ప్రిపేరైతే మెరుగైన ర్యాంకు సాధనకు మార్గం సులభమవుతుంది.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • మనకు పూర్తిగా, బాగా అర్థమైన, అవగాహన అయిన అంశాలు రాయనవసరం లేదు.
  • కీలక పదాలు, సాంకేతిక పదాలు, నూతన పదాలను వేరే రంగు పెన్నుతో రాస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
  • మనకు అర్థమయ్యేలా పెద్ద పద బంధాలను అబ్రివేషన్‌ విధానంలో రాయాలి. సంబంధిత పరీక్షలోని ప్రశ్నల తీరు ఆధారంగా నోట్స్‌ ఉండాలి. అది మనదైన శైలితో కూడినదై ఉండాలి.
  • అధికారిక సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన సిలబస్‌ ఆధారంగా మాత్రమే నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి.