Thank you for reading this post, don't forget to subscribe!

తెలంగాణలో ఆగస్టు 15 వ తేదీలోపు రూ. 2లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలు చేసేందుకు రేవంత్‌ ప్రభుత్వం రెడీ అవుతుంది.

అర్హులైన వారికే రుణమాఫీని అందించేందుకు అధికారులు ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలను అందిస్తున్నారు.

ఇందుకోసం వారు పాస్‌బుక్‌లు, రేషన్‌ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా వారు తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తుంది.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయ పన్ను చెల్లించే వారు, ఉద్యోగులకు దీని నుంచి మినహాయించాలని మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించినట్లు సమాచారం.

పంట రుణాల మాఫీపై ఈ వారంలో మరోసారి భేటీ కావాలని సర్కార్ చూస్తుంది. రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పించాలని ఇప్పటికే వ్యవసాయాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మరో రెండు, మూడు రోజుల్లో ఈ జాబితా అధికారుల వద్దకు వచ్చే ఛాన్స్ ఉంది.
కాగా, రైతుబంధు పథకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా.. రూ.2 లక్షల లోపు రుణాలు పొందినవారు దాదాపు ఇంత మందే ఉంటారని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.

రైతుబంధు లబ్ధిదారుల్లో దాదాపు ఆరు లక్షల మందికి పట్టాదారు పాస్‌బుక్‌లు లేవు.. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని తెలుస్తుంది. మరోవైపు కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురికి రైతుబంధు వస్తోంది. వారందరికీ రేషన్‌ కార్డుల్లేవు. కుటుంబ పెద్దకు మాత్రమే ఉంది.

రేషన్‌కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని తద్వారా మరో 18 లక్షల మంది తగ్గే ఛాన్స్ అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు.

ఇలా పాస్‌బుక్, రేషన్‌కార్డు, ఆదాయపన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల తొలగింపు నిబంధనలతో కేవలం 40 లక్షల మంది వరకు రుణమాఫీ పథకం వర్తిస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36 లక్షల మందికి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం నిధులు అందుతున్నాయి.