• రూ.1.7 లక్షల కోట్లకు చేరిక
  • జనవరిలో 30 శాతం పెరిగిన వాడకం
  • న్యూఢిల్లీ, మార్చి 23: దేశంలో క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరిగిపోతున్నది. ఆయా బ్యాంకులు ఆకర్షణీయ ఆఫర్లతో అందిస్తుండటం, అవసరాలకు బాగా పనికొస్తుండటంతో ఇప్పుడు అంతా క్రెడిట్‌ కార్డులను వాడేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో క్రెడిట్‌ కార్డుల వినియోగం దేశంలో గత జనవరితో పోల్చితే 30 శాతం పెరిగినట్టు తేలింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వివరాల ప్రకారం ఈ లావాదేవీల విలువ రూ.1.7 లక్షల కోట్లకు చేరింది. ఇకపోతే నిరుడు జనవరితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో ఒక్కో కార్డుపై జరిగిన సగటు లావాదేవీ విలువ రూ.16,769గా నమోదైంది. ఏడాది క్రితంతో చూస్తే 8 శాతం వృద్ధి ఉన్నది. కార్డులు కూడా డిసెంబర్‌ 31న 97.9 మిలియన్లుగా ఉంటే.. ఈ జనవరి 31న 99.5 మిలియన్లకు పెరిగాయి. గత ఏడాది జనవరితో చూస్తే 21 శాతం వృద్ధి కనిపిస్తుండటం గమనార్హం.
  • ఈ-కామర్స్‌కు..
  • దేశంలో అంతకంతకూ పెరుగుతూపోతున్న ఈ-కామర్స్‌ వ్యాపారానికి.. క్రెడిట్‌ కార్డులు దన్నుగా నిలుస్తున్నాయి. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు ఎక్కువగా క్రెడిట్‌ కార్డుల ద్వారానే జరుగుతున్నట్టు తాజాగా తేలింది. అలాగే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) టెర్మినల్స్‌ దగ్గర కూడా క్రెడిట్‌ కార్డుల హవానే నడుస్తున్నది. నిజానికి గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యూపీఐ సేవలతో జరిగే లావాదేవీలు రికార్డు స్థాయిలో ఉంటున్నా.. వీటికి సమానంగా ఇంకా క్రెడిట్‌ కార్డులకు ఆదరణ ఉంటుండటం విశేషం.
  • 56 శాతం వాటా
  • దేశీయంగా ప్రస్తుతం చలామణిలో ఉన్న క్రెడిట్‌ కార్డుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ), ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లకు చెందినవే దాదాపు 56 శాతంగా ఉన్నాయి. అయితే ఎస్బీఐతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ల వాటా గతంతో పోల్చితే కొంతమేర తగ్గినట్టు తాజా లెక్కల్లో స్పష్టమైంది. ఇక క్రెడిట్‌ కార్డు లావాదేవీల్లో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ వినియోగదారుల వాటా సుమారు 63 శాతంగా ఉన్నది. క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తున్నవారిలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఆర్బీఎల్‌ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వినియోగదారులు కాస్త తగ్గుముఖం పట్టినట్టు కూడా తెలుస్తున్నది.
  • ఇదీ సంగతీ..
  • క్రెడిట్‌ కార్డులను పద్ధతిగా వాడితే ఎన్ని ప్రయోజనాలుంటాయో.. అదుపు తప్పితే అంతే నష్టాలు కూడా ఉంటాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్డుకున్న పరిమితిలో 70 శాతాన్ని మించి ఖర్చు చేయరాదని, గడువులోగా చెల్లింపులు పూర్తిగా చేసేయాలని కూడా బ్యాంకింగ్‌ నిపుణులు సూచిస్తున్నారు. కొంతమేర చేసే చెల్లింపులతో వడ్డీ భారం తెలియకుండా మీద పడుతుందని, చివరకు క్రెడిట్‌ స్కోర్‌నూ ఇబ్బందుల్లో పడేస్తుందని వారు గుర్తుచేస్తున్నారు. ఇక అవసరమైతే తప్ప క్రెడిట్‌ కార్డులతో కొనుగోళ్లకు దిగవద్దని, అనవసరపు కొనుగోళ్లకు వెళ్తే ఆర్థిక క్రమశిక్షణ కొరవడుతుందని కూడా క్రెడిట్‌ కార్డు కస్టమర్లకు సలహా ఇస్తున్నారు.