Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లు గ్రామాలకే పరిమితం.. జాగ ఉన్నా పట్టణ ప్రాంతాలకు నో

Thank you for reading this post, don't forget to subscribe!

    • తొలిదశలో గ్రామాలకే ప్రాధాన్యం
    • ఎన్నికల తర్వాత మార్గదర్శకాలు
    • పేదలైనా తెల్లకార్డు లేకుంటే అంతే
    • పట్టణ ప్రాంతాల్లో ‘ఇన్‌సిటూ’ పద్ధతి
    •  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడత గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాబోతున్నది.
    • గ్రామాల్లో సొంత జాగ ఉన్నవారికే తొలుత దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా పట్టణ ప్రాంతాల్లో జాగలు ఉన్నా మొదటి దశలో అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు.
    • పార్లమెంటు ఎన్నికల తర్వాత మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
    • ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4,50,000 ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
    • సొంతజాగ ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తారు. దారిద్య్రరేఖ (బీపీఎల్‌)కు దిగువనున్న ఉన్న కుటుంబాలకు ఇది వర్తిస్తుంది. తెల్లరేషన్‌కార్డు తప్పనిసరి.
    • సొంత జాగ ఉండి కిరాయి ఇండ్లలో కానీ, కచ్చా ఇండ్లలో కానీ నివసిస్తున్నవారు ఈ పథకానికి అర్హులు.
    • గ్రామసభల్లో లబ్ధిదారులను గుర్తించిన తరువాత జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో కలెక్టర్‌ ఇండ్లను మంజూరు చేస్తారు.
    • కనీసం 400 చదరపు అడుగుల వైశాల్యంలో స్లాబు నిర్మా ణం, అందులో వంటగది, మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలి.
    • మహిళ పేర ఇల్లు మంజూరవుతుంది. పునాదులు పూర్తయ్యాక లక్ష, రూఫ్‌ లెవల్‌కి వచ్చాక మరో లక్ష, స్లాబ్‌ వేశాక రూ. 2 లక్షలు, మొత్తం పూర్తయ్యాక మిగిలిన లక్ష చొప్పున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది
    •  . జిల్లాల్లో కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో కమిషనర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ(టీఎస్‌హెచ్‌సీఎల్‌) పర్యవేక్షణలో గృహ నిర్మాణం సాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.

లోపభూయిష్టంగా మార్గదర్శకాలు

జీహెచ్‌ఎంసీ సహా పట్టణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పేదలు బస్తీల్లో నివసిస్తున్నారు. చాలామంది పేదలు పట్టణ శివారు ప్రాంతాల లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకునే స్థోమతలేక కిరాయి ఇండ్లలో ఉంటున్నారు. గ్రేటర్‌తోపాటు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువశాతం గ్రామ పంచాయతీ లేఔట్లే ఉన్నాయి. వీటికి రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఉంటా యి తప్ప ఎటువంటి అధికారిక అనుమతులు ఉండ వు. కొందరు గ్రామకంఠం, సీలింగ్‌ ల్యాండ్లలో నోటరీ పత్రాలపై కొనుగోలు చేసి కచ్చా ఇండ్లు ఏర్పాటు చేసుకున్నారు. చాలామందికి తెల్లరేషన్‌ కార్డులు లేవు. పట్టణ ప్రాంతాల్లోని వివిధ బస్తీలు, కాలనీలు, లేఔట్లకు సంబంధించిన జాగలపై మార్గదర్శకాల్లో స్పష్టత ఇవ్వలేదు. తెలుపురంగు కార్డు ఉన్నప్పటికీ మహిళలు లేకుంటే ఇల్లు మంజూరయ్యే అవకాశం లేదు. ప్రభుత్వమార్గదర్శకాల్లో ఇటువంటి పేదలకు సంబంధించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో సొంత జాగల్లో గుడిసెలు, తాత్కాలిక ఇండ్లలో నివసిస్తూ, తెల్లరేషన్‌కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులని అధికారులు స్పష్టంచేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నవారి కోసం ఇన్‌సిటూ(వారు ఉంటున్నచోటే సామూహికంగా అపార్ట్‌మెంట్లు) పద్ధతిలో ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. వారు ఉంటున్న బస్తీలను ఖాళీ చేయించి, అక్కడే మూడు, నాలుగు అంతస్తుల్లో చిన్నచిన్న ఫ్లాట్లను నిర్మించే యోచన ఉన్నట్లు అధికారులు తెలిపారు.

రూ.5000 కోట్ల లోటు పూడ్చడం ఎలా?

ప్రజాపాలన సందర్భంగా ఇంటి నిర్మాణం కోసం 82,82,332 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున 119 నియోజకవర్గాల్లో 4,50,000 ఇండ్లు నిర్మించనున్నట్టు ప్రకటించి, ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో గృహనిర్మాణం కోసం 7,740 కోట్లు కేటాయించింది. ఆ ఇండ్లకు 22,500 కో ట్లు ఖర్చవుతుంది. హడ్కో నుంచి 3,000 కోట్లు రుణంగా సేకరిస్తుండగా, ఒక్కో ఇంటికి 1.5లక్షల చొప్పున కేంద్రం నుంచి 6,750 కోట్ల వరకూ నిధులు వచ్చే అవకాశం ఉంది. అన్నీ కలుపుకొంటే 17,490 కోట్లు అవుతుంది. ఇండ్లకు రూ.ఐదు లక్షల చొప్పున ఇవ్వాలంటే రూ.5000 కోట్లకుపైగా లోటు కనిపిస్తున్నది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా నాలుగున్నర లక్షల మందికి ఇండ్లు మంజూరు చేస్తే ఈ లోటు ఎలా పూడ్చుతారన్నది అంతుబట్టడంలేదు.