పీఆర్సీ డౌటే.. ఇంకా పూర్తికాని నివేదిక, అడ్డంకిగా ఎన్నికల కోడ్‌..!

Thank you for reading this post, don't forget to subscribe!

  • ఇప్పట్లో అసాధ్యం.. జూన్‌ దాటినా సందిగ్ధమే

  • ఏప్రిల్‌ 2తో ముగియనున్న పీఆర్సీ కమిటీ గడువు

  • ప్రభుత్వ పరిశీలనలో గడువు పెంపు ప్రతిపాదన

రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణ ఇప్పట్లో సాధ్యపడే అవకాశాలు కనిపించడం లేదు.

తాజా అంచనాల ప్రకారం.. జూన్‌ దాటినా వేతన సవరణ సాధ్యంకాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అటు పీఆర్సీ కమిటీ నివేదిక సిద్ధంకాకపోవడం, ఇటు ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారడంతో వేతన సవరణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

దీంతో రెండో పీఆర్సీపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు నిరాశే మిగలనున్నది.

ఉద్యోగుల వేతన సవరణ సిఫారసులకు 2023 అక్టోబర్‌ 2న అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎన్‌ శివశంకర్‌ నేతృత్వంలో రెండో పీఆర్సీ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆరు నెలల్లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ గడువు ఏప్రిల్‌ 2తో ముగియనున్నది. ప్రస్తుతం ఈ కమిటీ పలు సంఘాలు, సంస్థల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నది.

ఎన్నికల కారణంగా కసరత్తు పూర్తిచేయలేకపోయామని, కాబట్టి గడువును మరో ఆరు నెలలు పొడగించాలని ప్రభుత్వాన్ని పీఆర్సీ కమిటీ కోరినట్టు తెలిసింది. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో గడువు పొడిగించవచ్చా? లేదా? అన్న అనుమానాలు తలెత్తాయి. పీఆర్సీ కమిటీ గడువు పెంచే అంశం ప్రస్తుతానికి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. దీనిపై ఓ అధికారిని అడగ్గా రెండు మూడు రోజుల్లో గడువు పెంపు ఉత్తర్వులు విడుదలవుతాయ ని చెప్పారు.

2023 జూలై నుంచి..
పాత పీఆర్సీ గడువు గత జూన్‌ 30తో ముగియగా, 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉన్నది. నూతన పీఆర్సీలో ప్రభుత్వం అంగీకరించిన ఫిట్‌మెంట్‌ మొత్తాన్ని 2023 జూలై నుంచి చెల్లించాలి. వీటినే పీఆర్సీ బకాయిలుగా వ్యవహరిస్తారు. గత కేసీఆర్‌ ప్రభు త్వం ఒక పీఆర్సీకి మరో పీఆర్సీకి మధ్య కాలానికి గల వ్యత్యాసాన్ని పూడ్చేందుకు 5% మధ్యంతర భృతిని ప్రకటించింది. ఈ బకాయిలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మానిటరీ బెన్‌ఫిట్స్‌ రూపంలో ఇస్తుందా? నోషనల్‌ బెనిఫిట్స్‌ రూపంలో ఇస్తుందా? అన్న సందిగ్ధంలో ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్‌లో ఉండగా, వాటినైనా ఇస్తే బాగుండేదన్న చర్చ ఉద్యోగవర్గాల్లో వినిపిస్తున్నది.