విద్యార్థి భవితవ్యానికి.. ‘అపార్‌’

అపార్‌ (అటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకాడమీ అకౌంట్‌ రిజిస్ట్రీ).. దేశంలో ప్రతి విద్యార్థికి అందించే గుర్తింపు నంబరు. జాతీయస్థాయిలో ప్రతి విద్యార్థికి ఒక్కో నంబరు కేటాయించి.. తదనుగుణంగా వారి సర్వ సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారు. ‘వన్‌ నేషన్‌ – వన్‌ స్టూడెంట్‌’ నినాదంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. జాతీయ నూతన విద్యా విధానం-2020 అమలులో భాగంగా ఈ దిశగా అడుగేసింది. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు కేటాయించనుండగా.. ఈ నెల 25వ తేదీ నుంచి క్రతువు మొదలవనుంది. ఈ మేరకు ఉమ్మడి మెదక్, వికారాబాద్‌ జిల్లాల్లో విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే వివిధ దశల్లో సర్కారు బడుల నిర్వాహకులకు అధికారులు అవగాహన కల్పించారు.
పొందే విధానం..

పాఠశాలకు విద్యార్థితో పాటు తల్లి లేదా తండ్రి కచ్చితంగా వెళ్లాల్సిందే. తొలుత యూడైస్‌+లో నమోదైన వివరాలు సరి చూసుకోవాలి. అనంతరం ఆన్‌లైన్‌లో ‘అపార్‌’ కార్డుకు దరఖాస్తు చేయాలి. హెచ్‌ఎం ధ్రువీకరణ అవశ్యం. ఆయన అంగీకారంతో యూడైస్‌+ వెబ్‌సైట్‌ వేదికగా ప్రక్రియ చేపడతారు. విద్యార్థి ఆధార్‌ అనుసంధానమైన చరవాణి నంబరుకు ఓటీపీ వస్తుంది. అనంతరం గుర్తింపు నంబరు జారీ అవుతుంది. ఆన్‌లైన్‌లో కార్డు ఒకసారి వెలువడితే.. సవరణకు అవకాశం ఉండబోదు.

విద్యార్థి భవితవ్యానికి.. ‘అపార్‌’

ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
గుర్తింపు కార్డు ప్రత్యేకతలు

విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఫొటో, క్యూఆర్‌ కోడ్, 12 అంకెలతో కూడిన గుర్తింపు నంబరు డిజిటల్‌ కార్డులో ఉంటాయి. అకాడమీ సమాచారం, విద్యార్థి విజయాలు ఎప్పటికప్పుడు నమోదవుతాయి. అకాడమీ పరంగా జీవితకాల గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. విద్యార్థి సంబంధిత సర్వ సమాచారం సమీకృతంగా ఒకే చోట లభిస్తుంది. ఆన్‌లైన్‌లో నంబరు నమోదు లేదా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే సమాచారం తెలుసుకోవచ్చు. అన్ని రకాల యాజమాన్యాల విద్యార్థులకు ఇది అవశ్యం.
నిర్వాహకుల బాధ్యత

అపార్‌ ప్రాధాన్యంపై తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సి ఉంది. యూడైస్‌+ వెబ్‌సైట్‌లో విద్యార్థికి పెన్‌ (పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబరు) ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆధార్‌ చెల్లుబాటు (వ్యాలిడేట్‌) అయి ఉండేలా ప్రేరణ కల్పించాలి.

నమూనా డిజిటల్‌ కార్డు
ప్రయోజనాలు..

గుర్తింపు కార్డు.. విద్యార్థి బ్యాంకు ఖాతా (అకాడమీ), డిజి లాకర్‌తో అనుసంధానమై ఉంటుంది. క్రెడిట్స్‌ (మార్కులు)ను బదలాయించవచ్చు. వివిధ విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రవేశ పరీక్షల్లో వివరాల నమోదు, ధ్రువీకరణ సులువుగా పూర్తవుతుంది. ఉపకార వేతనాలు, ఉద్యోగాల భర్తీ సమయం, ఇతర సందర్భాల్లో కీలకం కానుంది. ఈ సమాచారం ప్రామాణికంగా భావించనున్నారు.
అధికారులు ఏం చేస్తున్నారు..

ఈ కొత్త విధానంపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో సమావేశాలు, అవగాహన సదస్సులు కొనసాగుతున్నాయి. ప్రాథమిక విద్య మొదలు ఇంటర్‌ వరకు ‘అపార్‌’ గుర్తింపు నంబరు జారీ దిశగా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

అధికారిని సంప్రదించవచ్చు..

విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించే దిశగా పాఠశాలల నిర్వాహకులకు సమావేశాలు నిర్వహిస్తున్నాం. వారికి సాంకేతిక సమస్యలు తలెత్తితే విద్యా శాఖ కార్యాలయంలో గణాంక అధికారిని సంప్రదించాలి.

నర్సింలు, జిల్లా విద్యా శాఖ గణాంక అధికారి, సిద్దిపేట

ఎంతో ఉపయోగం..

ప్రతి విద్యార్థికి కేంద్ర ప్రభుత్వం అపార్‌ గుర్తింపు నంబరును జారీ చేస్తుంది. భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరం. విద్యార్థుల తల్లిదండ్రులు చొరవ చూపాలి. పాఠశాలల హెచ్‌ఎంలను సంప్రదించాలి. ఈ నెల 25 నుంచి కేటాయింపు ప్రక్రియ మొదలవుతుంది.

THANK YOU

DIVITI VENKATESH

CONTACT NO: 9505360250