• అలసిన మనసుకు, శరీరానికి నిద్రను మించిన ఉపశమనం లేదు. కంటి నిండా నిద్రపోయిన మర్నాడు మనసు తేలికపడుతుంది. శరీరం కొత్త శక్తిని పుంజుకుంటుంది. కునుకు పాట్లు లేకుండా హాయిగా ఉండాలంటే ఇదిగో ఈ సూచనలు పాటించండి.
  • రోజూ కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని చెబుతారు నిపుణులు. అయితే, ఏ సమయంలో నిద్రకు ఉపక్రమిస్తున్నామన్నది చాలా ముఖ్యం. ఒక్కోరోజు ఒక్కో సమయంలో పవళింపు సేవ చేస్తూ పోతే జీవగడియారం గతి తప్పుతుంది. అలా జరగకూడదంటే నిద్రాదేవిని నిర్దేశిత సమయంలోనే ఆహ్వానించాలి.
  • ‘నిద్ర సుఖమెరుగదు’ అంటారు. బాగా అలసిపోయినప్పుడు ఇది వర్తిస్తుందేమో కానీ, దైనందిన జీవితంలో కునుకమ్మ కంటి మీదికి చేరాలంటే పరిసరాలు బాగుండాలి. గది శుభ్రంగా ఉండాలి. దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి.. విరుల వీవనంత మనోహరంగా ఉండాలి. అప్పుడే గాఢ నిద్రలోకి జారుకోగలం.
  • కొందరు పక్కలోకి చేరగానే చిటికెలో నిద్దట్లోకి జారుకుంటారు. ఇంకొందరు అటూ ఇటూ పొర్లాడుతూ కుస్తీ పట్టినా కునుకు రాదు. నిద్రకు ఉపక్రమించిన తర్వాత 20 నిమిషాల్లోగా నిద్ర పట్టిందా సరి! లేకపోతే కాసేపు అటూ ఇటూ నడిచి, పది నిమిషాలు నచ్చిన పుస్తకం చదవండి. ఓపిక లేదంటే శ్రావ్యమైన సంగీతం విని పడుకుంటే.. నిద్ర రెక్కలు కట్టుకొని వచ్చి మీ కంటిరెప్పలపై వాలిపోతుంది.
  • పడుకునే ముందే మొబైల్‌ఫోన్లు పక్కన పెట్టేయండి.సినిమాలు చూస్తూ పడుకోవడం అలవాటు చేసుకుంటే కలత నిదుర ఆరోగ్యాన్ని చెదరగొడుతుంది. దీన్ని అలవాటుగా చేసుకుంటే మీ కంటిపాపకు మీరే కీడు చేసినవారు అవుతారు.