కాంట్రాక్టు ఉద్యోగులందరికీ కనీస వేతన స్కేల్‌ వర్తింపజేసిన AP ప్రభుత్వం.. ఆ స్కేల్‌ను కెజిబివి కాంట్రాక్టు ఉద్యోగులకూ అమలు చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది.

Thank you for reading this post, don't forget to subscribe!

కనీస వేతన స్కేల్‌ను వారందరికీ 2022 జనవరి ఒక నుంచి వర్తింపజేయాలని, బకాయిలను 12 వారాల్లో చెల్లించాలంటూ జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ వి కృపాసాగర్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ తీర్పు చెప్పింది. ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయాలని, బదిలీల జిఓను రద్దు చేయాలంటూ రాష్ట్రంలోని కస్తురిభా గాంధీ బాలికా విద్యాలయాల్లో కాంట్రాక్టు టీచర్లు 2022లో దాఖలు చేసిన పిటిషన్‌లో బదిలీల వ్యవహారంలో ఉత్తర్వులకు సింగిల్‌ జడ్జి నిరాకరించారు.

కనీస వేతనాలు, బకాయిలు చెల్లించాలని తీర్పు చెప్పారు. బదిలీలు చేయడానికి వీల్లేదంటూ, కాంట్రాక్టు టీచర్లు, సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వేర్వేరుగా అప్పీళ్లను దాఖలు చేశారు.

బదిలీలు చేసే అధికారం ఉందని తేల్చిన డివిజన్‌ బెంచ్‌.. కనీస వేతన పేస్కేల్‌ అమలు-బకాయిల చెల్లింపులు చెల్లించాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.

అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తీర్పు వెలువరించింది. కాంట్రాక్టు ఉద్యోగ నియామక ఒప్పందంలో బదిలీ అంశం ఉన్నప్పుడు ఆ మేరకు ప్రభుత్వం చేయొచ్చునని స్పష్టం చేసింది.

కెజిబివి కాంట్రాక్టు టీచర్లను బదిలీ చేస్తూ 2022లో ప్రభుత్వం జారీ చేసిన జిఓ 108ను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేసింది. ఆ జిఓను సమర్ధిస్తూ తీర్పు వెలువరించింది.